Friday 25 February 2011

అహంకారం ఎంత ప్రమాదమో ..........

అనగనగా ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. దానికి గర్వం ఎక్కువ. అన్నిటి కంటె తాను బాగా నృత్యం చేయగలననీ, అందరి కంటే తానే అందంగా ఉంటానని భావించేది. అంతేకాక ఇతర పక్షుల పట్ల చులకన భావం కలిగి ఉండేది. ఒకసారి అడవిలో ఉండే జంతువుల, పక్షుల సమావేశం జరిగింది. ఆ సమావేశం లో నెమలి మిగిలిన పక్షుల గురించి హేళనగా మాట్లాడసాగింది.


కాకితో ‘‘నువ్వు నల్లగా, అందహీనంగా ఉంటావు. ఇంత అందహీనంగా ఉన్న నువ్వు ఎలా బతుకుతున్నావు? నేనైతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని’’ అని బడాయిగా చెప్పింది. పక్కనే ఉన్న పావురాన్ని కూడా వదిలి పెట్టలేదు. ‘‘నువ్వు పాలిపోయిన రంగులో ఉంటావు. అస్సలు అందంగా ఉండవు’’ అని నిందించింది. ఇతర చిన్న పక్షుల్ని కూడా హేళన చేసింది. ‘‘మీరు గుప్పెడు కూడా ఉండరు. మీ అందరి కంటే నేను అందంగా ఉంటాను. మీరంతా నా తర్వాతి స్థానంలో ఉంటారు. అడవిలో పక్షులన్నిటికంటే నేనే గొప్ప మనుషులందరూ నన్నే ఇష్టపడతారు’’ అని గొప్పలు చెప్పుకుంది.




నెమలి వ్యవహారశైలితో మిగిలిన పక్షులన్నిటికీ నెమలి మీద కోపం వచ్చింది. ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలనుకున్నాయి. ‘ఏం చేయాలబ్బా!’ అని ఆలోచించసాగాయి. ఒకసారి నెమలి అన్ని పక్షులనీ పిలిచి, రోజురోజుకీ నృత్యంలో తన ప్రతిభ ఎలా పెరిగిపోతోందో చూడమని నృత్యం చేయసాగింది. ఇంతలో అటువైపుగా ఒక వేటగాడు రావటాన్ని మిగిలిన పక్షులు గమనించాయి. పక్షులన్నీ నెమలికి విషయం తెలియజెప్పకుండా ఒక్కొక్కటిగా నెమ్మదిగా జారుకున్నాయి.


అహంకారంలో తేలియాడుతున్న నెమలి వేటగాడిని గమనించలేదు. మిగిలిన పక్షులు ఎందుకు వెళ్లిపోతున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇంతలో వేటగాడు వల విసిరి నెమలిని పట్టుకున్నాడు. వలలో చిక్కుకున్న నెమలి, తనకు సహాయం చేయమని ఇతర పక్షుల్ని ప్రాధేయపడింది. కానీ పక్షులు ఏవీ నెమలికి సహాయపడటానికి ముందుకు రాలేదు. ‘‘గర్విష్టి నెమలికి తగిన శాస్తి జరిగింది.

తోటి పక్షులం అని మనల్ని గుర్తించకుండా, దేవుడిచ్చిన రూపాన్ని అర్థం చేసుకోకుండా ఎంతగా హేళన చేసింది. ఇటువంటి వారికి ఇలానే జరుగుతుంది. వీరికి దేవుడే బుద్ధి చెప్పాడు’’ అన్నాయి. కాని నెమలిలో కలిగిన పశ్చాత్తాపాన్ని గమనించిన ఒక వృద్ధపక్షి, నెమలిని రక్షించమని మిగిలిన పక్షులకు చెప్పింది. పశ్చాత్తాపానికి మించినది లేదని నీతి చెప్పింది. నెమలికి బుద్ధి వచ్చినందుకు సంతోషపడిన మిగిలిన పక్షులు, తమ యుక్తిని ప్రద ర్శించి నెమలిని వేటగాడి వల నుంచి రక్షించాయి.



నీతి: అహంకారంతో విరవ్రీగకూడదు. దేవుని సృష్టిలో అందరూ సమానమే.






 

2 comments:

  1. భలే ఉందండి కథ. చక్కటి చందమామ కథ చదివినట్లే ఉంది. గొప్పవాళ్ళకు తప్పకుండా అంతో ఇంతో గర్వం ఉంటుంది. ఆ లోపం నుంచి బయట పడాలి అంటే ఇలాంటి నీతే దారిచూపిస్తుంది.

    ReplyDelete